ఏపీలో శాంతిభద్రతలు కుప్పకూలాయా!

ఏపీ డిజిపి గౌతమ్ సవాంగ్ ను రెండోసారి రాష్ట్ర హై కోర్ట్ తన ముందుకు వచ్చి స్వాధీనం చేసుకున్న వాహనాలను తిరిగి ఇవ్వడంలో రాష్ట్ర పోలీసుల నిర్లక్ష్య వైఖరిపై సంజాయిషీ ఇవ్వమని ఆదేశించింది.
 
గతంలో అమరావతి ప్రాంతంలో ఆందోళన చేస్తున్న రైతుల కదలికలను కట్టడి చేయడం కోసం నిషేధాలు విధించిన సమయంలో సహితం హై కోర్ట్ ఆదేశించడంతో డిఐజి దాదాపు ఒకరోజంతా ఏకోర్టు ఆవరణలో గడపవలసి వచ్చింది. 
 
పలు కేసుల సందర్భంగా పోలీస్ ల వ్యవహారంపై హై కోర్ట్ తీవ్రమైన వాఖ్యలు చేస్తూ వచ్చింది. తీవ్ర సంచలనం కలిగించిన రెండు కేసులలో పోలీస్ ల తీరుపట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ సిబిఐ విచారణకు ఆదేశించింది. 
 
ఆ విధంగా ఆదేశించిన కేసులలో ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి బాబాయి వై ఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుతో పాటు, సస్పెన్షన్ కు గురైన ప్రభుత్వ వైద్యుడు డా. సుధాకర్ పట్ల విశాఖ పోలీసులు అమానుషంగా వ్యవహరించిన వ్యవహారం. 
 
వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణ చివరి దశలో ఉన్నట్లు రాష్ట్ర పోలీసులు చెప్పినా హై కోర్ట్ విశ్వసింపలేదు. రాష్ట్ర పోలీస్ లో మితిమీరిన రాజకీయ జోక్యం కారణంగా దేశంలో వృత్తిపర నైపుణ్యానికి పేరొందిన ఆంధ్ర ప్రదేశ్ పోలీసులతో ఇప్పుడు నైతిక స్థైర్యం దెబ్బతింటున్నదా అనే అనుమానాలు కలుగుతున్నాయి. 
 
రాష్ట్రంలో పోలీస్ రాజ్యం నడుస్తున్నదని, కేసులు పెట్టి ప్రజలను వేధిస్తున్నారని కేంద్ర హోమ శాఖ సహాయ మంత్రి జి కిషన్ రెడ్డి స్వయంగా వ్యాఖ్యానించడం రాష్ట్రంలో నెలకొన్న అరాజక పరిస్థితులను వెల్లడి చేస్తుంది. 
 
రెండు రోజుల క్రితం ఏపీ బిజెపి జరిపిన వర్చ్యువల్ ర్యాలీలో ప్రసంగిస్తూ తనకు ప్రాణహాని ఉన్నదని, కేంద్ర దళాలతో రక్షణ కల్పించాలని కోరుతూ అధికార పార్టీ ఎంపీ రఘురామకృష్ణ రాజు లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాకు వ్రాసిన లేఖను ప్రస్తావించారు. 
అధికార పార్టీ ఎంపీకే భద్రత లేదనడం రాష్ట్రంలో క్షీణించిన శాంతి భద్రతలకు అద్దం పడుతోందని కిషన్ రెడ్డి ధ్వజమెత్తారు. గతంలో ఇదే మాదిరిగా కేంద్ర బలగాల భద్రత కావాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కేంద్ర హోమ్ కార్యదర్శికి లేఖ వ్రాయడం గమనార్హం.
ఈ మధ్య టిడిపి నేతలు అచ్చంనాయుడు, జిసి ప్రభాకర రెడ్డిలను అరెస్ట్ చేయడం, మరో నేత అయ్యన్నపాత్రుడిపై నిర్భయకేసు పెట్టడం, పెళ్లికి వెళ్లారని యనమల రామకృష్ణుడు, చినరాజప్పలపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు దాఖలు చేయడం వంటివి కక్షసాధింపు రాజకీయాలకు నిదర్శనంగా టిడిపి నేతలు ఆరోపిస్తున్నారు.
ఇక సోషల్ మీడియా పోస్ట్ లపై సహితం ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తున్నది. సోషల్‌ మీడియాలో రాజకీయ పోస్టులను ఫార్వార్డ్‌ చేశారనే నెపంతో విశాఖకు చెందిన 70 ఏళ్ల నలంద కిశోర్‌, కృష్ణా జిల్లాలో చిరుమామిళ్ళ కృష్ణలను అరెస్టు చేశారు. అంతకుముందు గుంటూరులో 66 ఏళ్ల రంగనాయకమ్మపై కేసు మోపి పోలీస్ స్టేషన్ కు రప్పించారు. 
 
 స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా జిల్లా పోలీస్ అధికారులే పలువురు బిజెపి నేతలకు ఫోన్ చేసి నామినేషన్లు వేయవద్దని బెదిరించారు. పోలీసులు అధికార పార్టీ కార్యకర్తలుగా వ్యవహరిస్తున్నట్లు ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.