బీహార్ లో ఆర్జేడీకి గట్టి ఎదురు దెబ్బ  

బీహార్ అసెంబ్లీకి మరో కొద్దీ నెలల్లో ఎన్నికలు జరుగనున్న సమయంలో లాలూ ప్రసాద్ యాదవ్ నాయకత్వంలోని ఆర్జేడీ కి గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఈ పార్టీకి చెందిన ఐదుగురు ఎంఎల్ సిలు అధికార జెడియులో చేరారు. వీరంతా  ఆర్ జెడి చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్కు సన్నిహితులు కావడం గమనార్హం. 

బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ సమక్షంలో ఈ ఐదుగురు ఆర్ జెడి ఎంఎల్ సిలు పార్టీకి రాజీనామా చేసి అధికార జెడియులో చేరారు. జెడియులో చేరిన వారిలో సంజయ్ ప్రసాద్, కమరె ఆలమ్, రాధాచరణ్ సేఠ్, రణ్ విజయ్ సింగ్, దిలీప్ రాయ్ తదితరులు ఉన్నారు.  

మ‌రోవైపు ఆర్ జెడి ఉపాధ్య‌క్షుడు ర‌ఘువంశ్‌ప్ర‌సాద్ కూడా పార్టీ ప‌ద‌వికి రాజీనామా చేశారు. ఇటీవల కరోనా రావడంతో ఆయన ఎయిమ్స్ లో చేరి చికిత్స చేయించుకున్నారు. రఘువంశ్ ప్రసాద్ కూడా జెడియులో చేరనున్నట్టు ఆయన సన్నిహితులు చెబుతున్నారు. 

ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆర్ జెడికి చెందిన చాలా మంది అధికార జెడియు వైపు చూస్తుండడంతో పార్టీలో ఆందోళన వ్యక్తమవుతోంది. పైగా,  జులై ఏడున ఏడు ఎమ్మెల్సీ సీట్లకు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో లాలూ తనయుడు తేజ్ ప్రతాప్ యాదవ్‌ను ఎమ్మెల్సీగా పోటీ చేయనున్నారు.