భారత్‌లో కరోనా వ్యాప్తి రేటు చాలా తక్కువ   

భారత్ లో అధిక జనాభా ఉన్నప్పటికీ, మిగిలిన దేశాలతో పోలిస్తే భారత్‌లో కరోనా వ్యాప్తి రేటు తక్కువగానే ఉన్నదని కేంద్ర వైద్య శాఖ తెలిపింది. ప్రతి లక్షమంది జనాభాను ప్రాతిపదికగా తీసుకుని కరోనా కేసులను లెక్కిస్తే, ప్రపంచ దేశాల కన్నా అతి తక్కువ కేసులు నమోదవుతున్నట్లు పేర్కొంది. ఈ మేరకు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) గణాంకాలను ప్రస్తావించింది. 

దేలో ప్రతి లక్ష మంది జనాభాకు 30.04 కేసులు నమోదవుతుండగా, ప్రపంచ సగటు మాత్రం ఇందుకు మూడు రెట్లు ఎక్కువగా 114.67గా ఉన్నట్లు తెలిపింది. కరోనా కట్టడికి ప్రభుత్వం చేపట్టిన చర్యలకు ఈ గణాంకాలే నిదర్శనమని పేర్కొంది. అమెరికాలో అత్యధికంగా ప్రతి లక్ష మందికి 671.24 కేసులు నమోదవుతుండగా, ఆ తర్వాతి స్థానాల్లో జర్మనీ (583.88), స్పెయిన్‌ (526.22), బ్రెజిల్‌ (489.42), బ్రిటన్‌ (448.86) ఉన్నాయి. 

దేశంలో కొత్తగా 14,821 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,25,282కి చేరింది. కొత్తగా 445 మరణాలు సంభవించడంతో మొత్తం మృతుల సంఖ్య 13,699కి పెరిగింది. వరుసగా 11వ రోజు కూడా 10,000కుపైగా కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు 2,37,195 మంది వైరస్‌ నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం 1,74,387 మంది చికిత్స తీసుకుంటున్నారు. సోమవారం 9,440 మంది కోలుకున్నారు. దీంతో రికవరీ రేటు 55.77 శాతానికి చేరింది. 

ఆసియాలోనే అతిపెద్ద మురికివాడ అయిన ముంబైలోని ధారావి క్రమంగా కరోనా నుంచి కోలుకుంటున్నది. అత్యధిక జనసాంద్రత కలిగిన ఈ ప్రాంతంలో ఏప్రిల్‌ నెలలో 12 శాతంగా ఉన్న కరోనా వృద్ధిరేటు ప్రస్తుతం 1.02 శాతానికి దిగివచ్చింది. దీని వెనుక బృహన్‌ ముంబై మున్సిపల్‌ కార్పొరేషన్ ‌(బీఎంసీ) కృషి ఎంతగానో ఉన్నదని బీఎంసీని కేంద్రం ప్రశంసించింది.