చైనాకు 26 మృతదేహాలు అప్పగించిన భారత్ 

లడఖ్‌లోని గల్వన్ లోయలో 20 మంది భారతీయ సైనికుల బలిదానం జరిగిన వారం తరువాత కూడా తమ సైనికులు ఎంత మంది చనిపోయారనే సంఖ్యను చైనా ఇంతవరకు వెల్లడించలేదు. కానీ భారత్ సేనలు మాత్రం ఇరు దేశాల మధ్య మృతదేహాల మార్పిడి సమయంలో చైనాకు చెందిన 26 మంది సైనికుల మృతదేహాలు చైనాకు అప్పగించాయి. 

దీని ఫొటోగ్రఫీ, వీడియోగ్రఫీ కూడా చేపట్టారు. చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీకి చెందిన 70 మందికి పైగా గాయపడిన సైనికులను కూడా వారికి అప్పగించారు. ఈ సంఘటన జరిగిన వారం తరువాత కూడా చైనా తన నష్టాన్ని నివేదించడానికి ఇష్టపడలేదు. 

కాగా, భారత సైనికుల చేతిలో తమ కమాండింగ్‌ ఆఫీసర్‌, కొందరు సైనికులు చనిపోయారని సోమవారం వెల్లడించింది. కమాండింగ్‌ ఆఫీసర్‌ చనిపోయారన్న విషయాన్ని భారత్‌, చైనా లెఫ్టినెంట్‌ జనరల్‌ స్థాయి సమావేశంలో సైనికాధికారులు చెప్పినట్టు తెలిసింది. ‘చైనా సైనికులు 20 మంది కంటే తక్కువ చనిపోయారన్న విషయం వెల్లడిస్తే భారత్‌పై ఒత్తిడి పెరుగుతుంది. ఇది సరిహద్దుల వద్ద మరింత ఉద్రిక్తతలకు దారితీస్తుంది. అందుకే చెప్పలేదు’ అని చైనా నిపుణులు విశ్లేషించినట్టు చైనా అధికార పత్రిక గ్లోబల్‌ టైమ్స్‌ నర్మగర్భంగా మరణాల సంఖ్యను వెల్లడించింది.   

జూన్ 15 రాత్రి భారత దళాలతో జరిగిన ఘర్షణ తరువాత అనేక చైనా సైనికుల మృతదేహాలు గల్వన్ నది పెట్రోలింగ్ పాయింట్ 14 సమీపంలో నేలమీద చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు చేరవేసి అనంతరం వారి ఆదేశాల మేరకు చనిపోయిన చైనా సైనికుల మృతదేహాలను భద్రంగా, గౌరవప్రదంగా అప్పగించారు. గాయపడిన దాదాపు 70 మంది నడవలేని స్థితిలో ఉన్నవారిని కూడా చైనాకు అంతే గౌరవంగా అప్పగించారు.

జూన్ 15 న రాత్రి 7 గంటలకు గల్వన్ లోయలో భారతీయ దళాలతో చైనా తొలి ఘర్షణ జరిగింది. 30 నిమిషాల పాటు తోసుకోవడం, రాళ్లు, రాడ్లతో కొట్టుకోవడంతో  రెండు వైపులా సైనికులు గాయపడ్డారు. భారత సైనికులు చైనాపై పైచేయి సాధించారు. ఈ సమయంలో 16 బీహార్ రెజిమెంట్ సిబ్బంది జూన్ 6 న కార్ప్స్ కమాండర్ స్థాయి చర్చలలో సమ్మతి ఇచ్చినప్పటికీ చైనా దళాలు పట్టించుకోలేదు. 

రాత్రి 9 గంటలకు రెండవ రౌండ్ వాగ్వివాదం ప్రారంభమైంది, భారత కమాండింగ్ ఆఫీసర్ కల్నల్ సంతోష్ బాబు తలపై ఒక పెద్ద రాయి తగిలి అతను గల్వన్ నదిలో పడిపోయాడు. ఈ గొడవ సుమారు 45 నిమిషాల పాటు కొనసాగింది. చీకటిలోనే రెండు దేశాలకు చెందిన 300 మంది సైనికులు ఒకరితో ఒకరు కలబడి కొట్టుకొన్నారు. 

చైనా, భారత దళాల మధ్య మూడో ఘర్షణ 11 గంటలకు ప్రారంభమై.. అర్ధరాత్రి వరకు కొనసాగింది. ఇరు దేశాలకు చెందిన చాలా మంది సైనికులు గల్వన్ నదిలో పడ్డారు. పడిపోయిన తర్వాత కూడా చాలా మంది సైనికులు రాళ్లతో కొట్టారు. మూడవ ఘర్షణ ముగిసే సమయానికి తెల్లవారింది. 

అనంతరం అక్కడ చెల్లా చెదురుగా పడివున్న ఐదుగురు సైనిక అధికారులతో పాటు 26 మంది సైనికుల మృతదేహాలను గుర్తించిన భారత సైనికులు.. ఆ శవాలను చైనాకు అప్పగించారు. ఘర్షణ ముగిసిన మరుసటి రోజున భారత్‌కు చెందిన 20 మంది సైనికులు ప్రాణాలు కోల్పోయినట్లు ప్రభుత్వం ప్రకటించింది. 

అయితే చైనాకు అప్పగించిన 26 మంది సైనికుల మృతదేహాలతోపాటు 70 మందికి పైగా గాయపడిన సైనికులు ఉన్నా.. చైనా నుంచి ఇంకా ధృవీకరణ వార్తలు రాలేదు.  మృతదేహాల మార్పిడి సమయంలో ఇద్దరు మేజర్లు, ఇద్దరు కెప్టెన్లు, ఆరుగురు జవాన్లను చైనా బంధీలుగా చేసుకుంది. 

ఇదే సమయంలో చైనా కమాండింగ్ ఆఫీసర్‌తో సహా చైనాకు చెందిన 15 మంది సైనికులను కూడా భారత్ బంధీలుగా చేసుకుంది. ఇరువైపుల మేజర్ జనరల్ చర్చలు మధ్యాహ్నం వరకు కొనసాగాయి. ఈ సమావేశంలో ‘తప్పిపోయిన’ సైనికులను రెండు వైపుల నుంచి తిరిగి అప్పగించడానికి అంగీకరించారు. సాధారణ స్థాయిలో మూడు రౌండ్ల చర్చలు జరిగాయి. భారత్‌, చైనా జూన్ 19న రాత్రి ఒకరికొకరు బందీలను అప్పగించుకొన్నాయి.