చైనా ఉత్పత్తులపై కస్టమ్స్ సుంకం పెంపు

భారత్-చైనా మధ్య కొనసాగుతున్న సరిహద్దు వివాదం నేపథ్యంలో  చైనా ఉత్పత్తులపై కస్టమ్స్ సుంకాన్ని పెంచే దిశగా  కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తోంది. చైనా నుంచి దిగుమతి చేసుకునే ఉత్పత్తులపై  సుంకాన్ని పెంచడానికి చర్చలు జరుగుతున్నాయని అధికార వర్గాలు తెలిపాయి. 

ఇంకా తుది నిర్ణయం తీసుకోనప్పటికీ, పొరుగు దేశం నుండి అనవసరమైన వస్తువులను దిగుమతి చేసుకోవడాన్ని తగ్గించాలని ప్రభుత్వం నొక్కి చెబుతుంది. పిటిఐ నివేదిక ప్రకారం, చైనా నుండి దిగుమతి చేసుకున్న వస్తువులపై సుంకాల పెంపుపై అధికారులలో చర్చ జరిగింది.

భారతదేశం యొక్క మొత్తం దిగుమతుల్లో చైనా వాటా 14% కావడం గమనార్హం. గతేడాది ఏప్రిల్ నుంచి ఫిబ్రవరి 2020 వరకు భారత్ 62.4 బిలియన్ డాలర్లను దిగుమతి చేసుకోగా, 15.5 బిలియన్ డాలర్లను పొరుగు దేశాలకు ఎగుమతి చేసింది. 

చైనా నుండి దిగుమతి చేసుకున్న వస్తువులలో గోడ గడియారాలు, సంగీత వాయిద్యాలు,  వాచ్ లు, బొమ్మలు, క్రీడా వస్తువులు, ఫర్నీచర్, దుప్పట్లు, ప్లాస్టిక్స్, ఎలక్ట్రానిక్ ఉపకరణాలు, ఎలక్ట్రికల్ మెషినరీ, రసాయనాలు, ఇనుము ఉక్కు వస్తువులు, ఎరువులు, ఖనిజ ఇంధనం,  లోహాలు మొదలైనవి ఉన్నాయి.