కల్నల్ సంతోష్ కు అశ్రునయనాలతో వీడ్కోలు  

సరిహద్దులో శత్రు సైన్యానికి ఎదురొడ్డి జాతి కోసం వీర మరణం పొందిన కల్నల్ సంతోష్ బాబు పార్థివదేహాన్ని అశ్రునయనాలతో సైనిక అధికార లాంఛనాలతో ఘనంగా వీడ్కోలు పలికారు. సంతోష్‌ కుమారుడు అనిరుధ్‌ చిన్న వయసు కావడంతో సంతోష్‌ తండ్రి ఉపేందర్ తోడు రాగా అనిరుధ్‌తో తలకొరివి పెట్టించారు. 

కేసారం వ్యవసాయ క్షేత్రంలో సైనుకులు గౌరవార్థం గాల్లోకి మూడు రౌండ్ల కాల్పులు జరిపి నివాళులు అర్పించారు. జనం భారీగా తరలి వచ్చి వీరుడికి నివాళులర్పించారు. వీరజవాను సంతోష్ కు కుటుంబసభ్యులు, రాజకీయ నేతలు, ప్రజలు నివాళులర్పించారు. జనం వీరుడిపై పూల వర్షం కురిపించి నివాళులర్పించారు. 

సంతోష్ అంతిమయాత్ర 6 కిలో మీటర్లు సాగింది.  అంతిమ సంస్కారాల ప్రక్రియలో 16 బిహార్ రెజిమెంట్ బృందం పాల్గొంది. పెద్ద ఎత్తున ప్రజలు భారత్ మాతాకీ జై అనే నినాదాలు చేశారు. సంతోష్‌ను కడసారి చూసేందుకు దారి పొడవునా భౌతికదూరం పాటిస్తూనే ప్రజలు సెల్యూట్‌ చేస్తూ ఘన నివాళి అర్పించారు.

దహన సంస్కారాల ముగిసిన అనంతరం మంత్రి జగదీష్‌ రెడ్డి మాట్లాడుతూ సంతోష్‌ భార్యకు ఉద్యోగం ఇవ్వడానికి సీఎం కేసీఆర్‌ అంగీకారం తెలిపినట్లు చెప్పారు. అంత్యక్రియలు జరిగిన చోట సంతోష్‌ స్మారక స్థూపం ఏర్పాటు చేస్తామని, సూర్యాపేట కూడలిలో కాంస్య విగ్రహం ఏర్పాటుతో పాటు, నగరంలోని ఓ సర్కిల్‌కు సంతోష్‌ పేరు పెడుతామని ‌ వెల్లడించారు.