గాల్వ‌న్ లోయపై చైనాకు భారత్ హెచ్చరిక  

గాల్వ‌న్ లోయ త‌మదే అని చైనా చేసిన వాద‌న‌లను భార‌త్ తీవ్రంగా ఖండించింది. చైనా చేస్తున్న ఆరోప‌ణ‌లు.. అతిగా ఉన్నాయ‌ని, నిర్ధార‌ణ‌కు వీలు కాని విధంగా అర్థ‌ర‌హితంగా డ్రాగ‌న్ దేశం ప్ర‌వ‌ర్తిస్తున్న‌ట్లు భార‌త్ ధ్వజమెత్తింది.
తూర్పు ‌డఖ్‌లోని గాల్వ‌న్ వ్యాలీలో సోమ‌వారం రాత్రి భార‌త‌, చైనా బ‌ల‌గాల మ‌ధ్య హింసాత్మ‌క ఘ‌ర్ష‌ణ జ‌రిగిన విష‌యం తెలిసిందే. ఈ ఘ‌ట‌న‌పై స్పందించిన చైనా గాల్వ‌న్ లోయ‌లోని భూభాగం త‌మ‌దే అన్న వాద‌న వినిపించడం పట్ల భార‌త విదేశాంగ శాఖ ప్ర‌తినిధి అనురాగ్ శ్రీవాత్స‌వ తీవ్ర అభ్యంతరం తెలిపారు.
గాల్వ‌న్ అంశ‌పై విదేశాంగ మంత్రి జైశంకర్ చైనా విదేశాంగ మంత్రితో మాట్లాడిన‌ట్లు అనురాగ్ శ్రీవాత్స‌వ తెలిపారు.  గాల్వ‌న్‌లో ప‌రిస్థితిని బాధ్య‌తాయుతంగా ప‌రిష్క‌రించాల‌ని రెండు దేశాలు అంగీక‌రించాయి.
జూన్ 6వ తేదీన సీనియ‌ర్ క‌మాండ‌ర్ల స్థాయిలో కుదిరిన అవ‌గాహ‌న‌ల‌ను అమ‌లు చేయాల‌ని రెండు దేశాలు నిర్ణ‌యించిన‌ట్లు అనురాగ్ తెలిపారు.  గాల్వ‌న్ వ్యాలీలో జ‌రిగిన అసాధార‌ణ ఘ‌ట‌న వ‌ల్ల రెండు దేశాల సంబంధాలు దెబ్బ‌తినే ప్ర‌మాదం ఉన్న‌ట్లు చైనాతో భార‌త్ స్పష్టం చేసింది.
కాగా, గల్వాన్‌లో భారత సైనికులపై చైనా సైనికులు ముందస్తు పథకం ప్రకారమే దాడిచేశారని విదేశాంగమంత్రి ఎస్‌ జైశంకర్‌ ఆరోపించారు. చైనా విదేశాంగమంత్రి వాంగ్‌ ఈతో బుధవారం ఫోన్లో మాట్లాడుతూ చైనా సైన్యం ఇలాంటి చర్యలు మానుకోకపోతే ద్వైపాక్షిక సంబంధాలు తీవ్రంగా దెబ్బతింటాయని హెచ్చరించారు. చైనా తన తప్పులను సరిదిద్దుకోవాలని హితవు చెప్పారు.