వైసిపి ఎంపీ  రఘురామరాజు ధిక్కార ధోరణి 

తరచూ వివాదాస్పద వ్యాఖ్యలతో అధికారపార్టీని ఇరకాటంలో పడవేస్తూ ధిక్కార ధోరణి ప్రదర్శిస్తున్న  నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణం రాజుపై క్రమశిక్షణా చర్యలకు ముఖ్యమంత్రి వై  ఎస్ జగన్  సిద్దమవుతున్నట్లు తెలుస్తున్నది. జగన్ తన పార్టీ ఎంపీలు కలవాలంటే సమయం లభించడం లేదని, ఇద్దరు ముగ్గురు తప్ప సీఎంను  పోతున్నారంటూ బహిరంగంగా అసంతృప్తి వ్యక్తం చేస్తూ వస్తున్నారు. 

పైగా  హోమ్ మంత్రి అమిత్ షా కొన్ని సందర్భాలలో జగన్ కు అప్పోయింట్మెంట్ ఇవ్వలేక పోవడాన్ని సమర్ధిస్తూ వస్తున్నారు. అదే గాక జగన్ ఏడాది పాలనలో కులరాజకీయం, అవినీతి, ఇసుక, ల్యాండ్ మాఫియా పెరిగిపోతున్నాయంటూ  బహిరంగ విమర్శలు చేస్తున్నారు. ఈ విమర్శలు అన్ని నేరుగా సీఎం జగన్ పైననే అని వైసిపి నేతలు భావిస్తున్నారు.

మరోవంక గతంలో బీజేపీలో ఉండడంతో కేంద్రంలో ఆ పార్టీ నాయకత్వంతో సన్నిహితంగా ఉంటున్నారని, పలువురు పార్టీ ఎంపిలను బిజేపికి సన్నిహితం చేస్తున్నారని ఆరోపణలు కూడా వస్తున్నాయి. ఢిల్లీలో వైసిపి ప్రతినిధిగా వ్యవహరిస్తున్న వైజయసాయి రెడ్డి ధోరణులు నచ్చని పార్టీ ఎంపీలు పలువురు ఆయనకు సన్నిహితంగా ఉంటూ ఉండడం కూడా వైసీపీ నాయకత్వానికి అసహనం కలిగిస్తున్నది.

ఆయనకు షో కాజ్ నోటీసులు జారీ చెయ్యాలని ఆ పార్టీ అధినేత జగన్ ఇప్పటికే నిర్ణహించినట్లు చెబుతున్నారు. నోటీసుకు జవాబును బట్టి పార్టీ నుండి సస్పెండ్ చేయనున్నట్లు కూడా చెబుతున్నారు. రాజాగా రఘురామరాజుపై నరసాపురం వైసిపి ఎమ్మెల్యే ప్రసాదరాజు తీవ్రస్థాయిలో చేసిన విమర్శలు పార్టీ అధిష్ఠానం వైఖరిని వెల్లడి చేశాయి.

అయితే ఈ విమర్శలకు ఘాటుగా స్పందించడం ద్వారా పార్టీ నాయకత్వంతో తాడో పేడో తేల్చుకోవడానికి రఘురామరాజు సిద్ధంగా ఉన్నట్లు సంకేతం ఇచ్చారు. తాను వైసీపీ ఎంపీగా గెలవడం నిజమని, అయితే పార్టీలోకి తనకు తానుగా రాలేదని, కాళ్లావేళ్లా బతిమిలాడితే వచ్చానని అంటూ కొంచెం ధిక్కార ధోరణిలో మాట్లాడారు.

మంచిదో, చెడ్డదో పార్టీ అభ్యర్థిగా పోటీ చేయడానికి  నిర్ణయం తీసుకోవలసి వచ్చిందని చెబుతూ ముందు తనను పార్టీలో చేరమని  ఛీ కొట్టిన విషయాన్ని కూడా చెప్పుకొచ్చారు. తన కర్మో, వాళ్ల కర్మో పక్కన పెడితే తాను కాబట్టే నరసాపురం ఎంపీ సీటు వైసీపీ సొంతమైందని కూడా పేర్కొన్నారు.

గత ఏడాదిగా రాష్ట్రంలో జరుగుతున్న అక్రమాలపై జగన్‌తో భేటీకి ప్రయత్నించగా సమయం ఇవ్వలేదని అంటూ సీఎంపై తన అసమ్మతిని బహిరంగంగానే వ్యక్తం చేస్తున్నారు. ప్రతిపక్షాలు విమర్శలు చేస్తే.. ఆయా కులాలకు చెందిన వారితో విమర్శలు చేయిస్తారని ఇది వైసీపీ సాంప్రదాయమని అంటూ అధిష్ఠానంపై విరుచుకు పడ్డారు. దయచేసి కులాల మధ్య చిచ్చుపెట్ట వద్దని హితవు చెబుతూ  ప్రసాదరాజుతో ఎవరు మాట్లాడించారో తనకు చురక అంటించారు.