రూ 2.24 లక్షల కోట్లతో ఏపీ బడ్జెట్‌

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి మంగళవారం బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఆర్ధిక శాఖామంత్రిగా రెండోసారి ఆయన శాసన సభలో బడ్జెట్ ను ‌ ప్రవేశపెట్టారు. బడ్జెట్ అంచనా వ్యయం రూ.2,24,789 కోట్లుగా, రెవెన్యూ అంచనా రూ.1,80,392 కోట్లు, మూలధన వ్యయం రూ.44,396 కోట్లుగా ఉన్నదని  రాజేంద్రనాథ్‌రెడ్డి తెలిపారు.శాసన మండలిలో ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్‌చంద్రబోస్‌ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు.

కరోనా మహమ్మరి కారణంగా ఈసారి బడ్జెట్ అంచనాలు 1.4 శాతం తగ్గాయని బుగ్గన్న వెల్లడించారు.   రెవిన్యూ లోటు రూ.18,434.14 కోట్లుగా అంచనా వేసినట్టు తెలిపారు. ఆర్థిక లోటు దాదాపు రూ. 48,295.58 కోట్లు ఉండవచ్చని అంచనా వేశారు. రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో 4.78 శాతం ఆర్థిక లోటు, 1.82 శాతం రెవిన్యూ లోటుగా ఉంటుందని చెప్పారు.

ఈ బడ్జెట్ లో సంక్షేమానికి ప్రాధాన్యత ఇచ్చామని ఆయన పేర్కొన్నారు. కరోనాపై పోరులో రాష్ట్రం ముందున్నదని తెలిపారు. కరోనా నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థ కుంటుపడకుండా చర్యలు తీసుకునట్టు వెల్లడించారు. 2018-19 ఆర్థిక సంవత్సరంలో స్థూల ఉత్పత్తి 8శాతమే పెరిగిందని చెబుతూ  గత ప్రభుత్వం మిగిల్చిన అప్పులు సునామీలా మీద పడ్డాయని వెల్లడించారు.

బడ్జెట్‌లో ముఖ్యాంశాలు 

వ్యవసాయానికి రూ.11,891 కోట్లు; వైఎస్‌ఆర్‌ రైతు భరోసాకు రూ.3,615 కోట్లు; ధరల స్థిరీకరణ నిధి రూ.3 వేల కోట్లు; వడ్డీ లేని రుణాల కోసం రూ.1,100 కోట్లు; మైనార్టీ సంక్షేమానికి రూ.1,998 కోట్లు; ఎస్టీల సంక్షేమానికి రూ.1,840 కోట్లు; ఎస్సీల సంక్షేమానికి రూ.7,525 కోట్లు; కాపుల సంక్షేమానికి రూ.2,845 కోట్లు; బీసీల సంక్షేమానికి రూ.23,406 కోట్లు.

విద్యశాఖకు రూ.22,604 కోట్లు; వైద్య రంగానికి రూ.11,419 కోట్లు’ఆరోగ్యశ్రీకి రూ.2100 కోట్లు; వైఎస్‌ఆర్‌ గృహవసతికి రూ.3వేల కోట్లు; పీఎం ఆవాజ్‌ యోజన అర్బన్‌కు రూ.2540 కోట్లు; పీఎం ఆవాజ్‌ యోజన (గ్రామీణం) రూ.500 కోట్లు; బలహీనవర్గాల గృహ నిర్మాణానికి రూ. 150 కోట్లు; డ్వాక్రా సంఘాలకు రూ.975 కోట్లు; రేషన్‌ బియ్యానికి రూ.3వేల కోట్లు.