లిపులేఖ్ రోడ్డు పూర్తిగా భారత భూభాగంలోనే   

లిపులేఖ్ రోడ్డును పూర్తిగా భారత భూభాగంలోనే నిర్మిస్తున్నామని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్పష్టం చేశారు. ఈ విషయమై నేపాల్‌తో తలెత్తిన వివాదాల‌ను ప్రస్తావిస్తూ వాటిని చర్చల ద్వారా పరిష్కరించుకుంటామని భరోసా వ్యక్తం చేశారు. నేపాల్ పట్ల భారత్ కు ఎలాంటి అపార్ధాలు లేవని తెలిపారు.

సోమవారం ‘ఉత్తరాఖండ్ జన సంవాద్ ర్యాలీ’లో ప్రసంగిస్తూ  రోటీ- బేటీ లాగా ఇరుదేశాల సంబంధాలు కొనసాగుతున్నాయని చెప్పుకొచ్చారు.  ప్రపంచంలోని ఏ శక్తీ భారత్ – నేపాల్ బంధాన్ని విడ‌దీయ‌లేద‌ని రాజ్‌నాథ్ స్పష్టం చేశారు.

భారత్-నేపాల్ సంబంధాలు కేవలం చారిత్రక, సాంస్కృతిక సంబంధాలే కాదని, ఆధ్యాత్మిక బంధం కూడా ఉందని రాజ్‌నాథ్‌సింగ్ గుర్తు చేశారు. ఇరుదేశాల మధ్య బంధాలు ఎలా తెగిపోతాయ‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు. పశుపతి నాథుడిని ఎవరు మరిచిపోతారని, అమర్‌నాథుడిని, సోమనాథుడిని, కాశీ విశ్వనాథుడిని, పశుపతి నాథుడిని ఎలా విడదీసి చూడగలమ‌ని ఆయ‌న ప్ర‌శ్న లేవ‌నెత్తారు.

లిపులేఖ్, కాలాపాని, లింపియాధుర‌ ప్రాంతాలు త‌మ అంతర్భాగమంటూ  ఇటీవ‌ల నేపాల్ త‌మ రాజకీయ పటంలో చూపుకుంది. ఈ నేపథ్యంలో రాజ్‌నాథ్ సింగ్ భార‌త్‌-నేపాల్ సంబంధాల‌పై స్పందించారు.