నగరాలలో వైరస్‌పై పోరుకు సన్నద్ధం చేయాలి 

నగరాలలో ఎక్కువ సంఖ్యలో సంక్రమణలు తలెత్తుతుండటంతో అత్యధిక స్థాయిలో వైరస్ పరీక్షలు జరగాల్సి ఉంటుందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సూచించారు.  దేశంలో కరోనా వ్యాప్తి, కట్టడి చర్యలపై ప్రధాని నరేంద్ర శనివారం అత్యున్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఆసుపత్రులను సమగ్ర రీతిలో వైరస్‌పై పోరుకు సన్నద్ధం చేయాల్సి ఉంటుందనే విషయంపై దృష్టి సారించినట్లు ఆ తరువాత ప్రధాని ట్వీట్ చేశారు.   

దేశంలో వైరస్ సోకిన వారి సంఖ్య మూడు లక్షలు దాటడం, ఒక్కరోజే 11458 మందికి పాజిటివ్ రావడం వంటి అంశాలను చర్చించినట్లు ప్రధాని తెలిపారు. వచ్చే రెండు నెలల్లో పరిస్థితి ఏవిధంగా ఉంటుందనేది ప్రస్తావనకు వచ్చింది. అత్యధిక కేసులు నమోదు అవుతున్న ప్రాంతాలలో ఏ స్థాయిలో నివారణ చర్యలు చేపట్టారు? పరిస్థితిని సమగ్ర రీతిలో ఎదుర్కొనేందుకు అవసరమైన సమర్థవంతపు రోడ్‌మ్యాప్ గురించి ప్రధాని ఆరాతీశారు.

ప్రత్యేకించి ఐదు రాష్ట్రాల్లోనే అత్యధిక కేసులు నమోదు అవుతున్నాయనే విషయాన్ని ప్రధాని దృష్టికి అధికారులు తీసుకువచ్చారు. వైరస్ వేగంగా విస్తరిస్తున్న ప్రాంతాలను గుర్తించడం జరిగినందున అక్కడ తగు సంఖ్యలో చికిత్సలకు పడక‌లు, వెంటిలేటర్లు ఇతరత్రా వైద్య సౌకర్యాలు కల్పించాల్సి ఉంటుందని ప్రధాని సూచించారు. సమీక్షలో హోం మంత్రి అమిత్ షా, ఆరోగ్య మంత్రి డాక్టర్ హర్షవర్థన్ పాల్గొన్నారు.

కరోనాపై పోరు క్రమంలో ఎప్పటికప్పుడు సరికొత్త సవాళ్లు ఎదురవుతున్నాయి. ప్రత్యేకించి అతి పెద్ద నగరాలలో పరిస్థితి ఆందోళనకరం అవుతోంది. సడలింపులతో ప్రజల కదలికలు పెరగడం, వైరస్ వ్యాప్తిపై నియంత్రణలు లేకపోవడం ప్రధాన సమస్యలుగా మారినట్లు ఈ సమీక్షలో గుర్తించారు.ఢిల్లీలో పరిస్థితిపై అత్యవసర ప్రాతిపదికన స్పందించాల్సి ఉందని మోడీ అభిప్రాయపడ్డారు.

ఈ దిశలో ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్, రాష్ట్ర ముఖ్యమంత్రి, ఉన్నతాధికారులతో అత్యవసర భేటీని నిర్వహించాల్సి ఉందని అమిత్ షా, హర్షవర్థన్‌లకు ప్రధాని సూచించారు. ఢిల్లీలో కరోనా తీవ్రతను తగ్గించేందుకు పూర్తి సమన్వయ చర్యలు అవసరం. కేంద్ర, ఎన్‌సిటి ప్రభుత్వ సీనియర్ అధికారులు, మున్సిపల్ అధికారులు కూడా సమస్యపై తమ స్పందనను తెలిపి తగు రీతిలో సమన్వయ, సమగ్ర స్పందనకు దిగాల్సి ఉందని ప్రధాని తెలిపారు. ప్రధాని సూచన మేరకు ఆదివారమే ఢిల్లీకి సంబంధించి పూర్తిస్థాయి సమావేశం జరుగుతుందని అధికారులు తెలిపారు.