ఏపీలో నలుగురు ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్య 

ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల విడుదలైన ఇంటర్‌ ఫలితాలు పలువురి కుటుంబంలో విషాదం నింపాయి. గురువారం ఇంటర్‌ పరీక్షల ఫలితాలను ప్రభుత్వం విడుదల చేయగా పరీక్షల్లో ఫెయిల్‌ అయిన విదార్థులు మనస్థాపానికి గురై చేసుకుంటున్న ఆత్మహత్యల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతున్నాయి. ఇప్పటి వరకూ ఎపిలో నలుగురు  విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. 

గుంటూరు జిల్లా పిడుగురాళ్ల జూలకల్లులో పురుగుల మందు తాగి ఓ విద్యార్థి, కడప జిల్లా రాజంపేటలో పావని అనే మరో విద్యార్థిని, ప్రకాశం జిల్లా నాగలుప్పలపాడులో బావిలో దూకి ఇంకో విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్నారు. తాజాగా శ్రీకాకుళం జిల్లాలో మరో విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. 

ఇంటర్‌ సెకండియర్‌లో రెండు సబ్జెక్టులు ఫెయిల్‌ కావడంతో స్వర్ణలత అనే విద్యార్థిని మనస్తాపానికి గురైంది. తల్లిదండ్రులు ఇంట్లో లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఒక్కగానొక్క కూతురని అల్లారుముద్దుగా చూసుకుంటున్న తల్లిదండ్రులకు పుట్టెడు శోకాన్ని మిగిల్చింది. 

పాలకొండ పట్టణంలోని ఇందిరానగర్‌ కాలనీకి చెందిన దూశి లక్ష్మణరావు, సరోజిని దంపతుల ఏకైక కుమార్తె స్వర్ణలత (17) ఇటీవలే ఇంటర్‌ సెకండియర్‌ పరీక్షలు రాసింది. ఇటీవల విడుదలైన ఫలితాల్లో రెండు సబ్జెక్టులు ఫెయిల్‌ అయింది. అప్పటినుంచి మనస్తాపంతో ఉంటున్న కూతురిని తల్లిదండ్రులు సముదాయిస్తూ వచ్చారు.