భారీ నిధులతో అమెరికా మీడియాపై చైనా ప్రభావం 

అమెరికాలోని కీలక వార్తా పత్రికలకు భారీ నిధులను సమకూర్చడం ద్వారా చైనా తనకు అనుకూల ప్రచారం చేయించుకొంటున్నది. అంతేకాకుండా భారత్ పై విద్వేష ప్రచారానికి ఉపయోగించుకొంటున్నది.  చైనా కమ్యూనిస్ట్ పార్టీ  అధికార పత్రిక `చైనా డైలీ’ గత నాలుగేళ్లుగా అమెరికా పత్రికలకు ప్రకటనలు, ప్రచురణ చార్జీల పేరుతో 19 మిలియన్ డాలర్లను చెల్లించినట్లు తెలుస్తున్నది. 
 
తమ రాజకీయ ప్రయోజనాలు నెరవేర్చుకోవడం కోసం చైనా విదేశీ పత్రికలను సాధనాలుగా ఉపయోగించుకొంటున్నట్లు ఫ్రీడమ్ హౌస్ వంటి సంస్థలు చాలాకాలంగా ఆరోపిస్తున్నాయి. కరోనా వైరస్ చైనా కారణం అంటూ అమెరికా సమాజం ఆగ్రహం వ్యక్తం చేస్తుండగా అమెరికా పత్రికలు మాత్రం సానుకూలత వ్యక్తం చేస్తుండడంతో జరిపిన అధ్యయనంలో ఈ అంశం వెల్లడైనది. 
 
వాల్ స్ట్రీట్ జర్నల్ కు 6 మిలియన్ డాలర్లు, వాషింగ్ టన్  పోస్ట్ కు 4.6 మిలియన్ డాలర్లు, 2.4 లక్షల డాలర్లు ఫారిన్ పాలసీకి, 50,000 డాలర్లు న్యూ యార్క్ టైమ్స్ కు, 34,600 డాలర్లు ది డస్ మెయిన్స్  రిజిస్టర్ కు, 76,000 డాలర్లు సిక్యూ రోల్ కాల్ కు చెల్లించినట్లు వెల్లడైనది. 
 
ప్రముఖ అమెరికా పత్రికలకు ప్రకటనల రూపంలో 11 మిలియన్ డాలర్లను ఖర్చు పెట్టడంతో పాటు అదనంగా 7.6 మిలియన్ డాలర్లను తన పత్రిక ప్రచురణ చార్జీలు అంటూ ది చికాగో టైమ్స్, లోస్ ఏంజెల్స్ టైమ్స్, ది సీటెల్ టైమ్స్, ది అట్లాంటా జర్నల్, ది హౌస్టన్ క్రానికల్, ది బోస్టన్ గ్లోబ్ వంటి వాటికి చైనా డైలీ చెల్లించింది. 
 
ఉదాహరణకు లాస్  ఏంజెల్స్ టైమ్స్ కు ప్రచురణ చార్జీల పేరుతో 6,56,523 డాలర్లు చెల్లించినట్లు తెలుస్తున్నది. ట్విట్టర్ లో ప్రకటనలకు సహితం చైనా కమ్యూనిస్ట్ పార్టీ అధికారిక పత్రిక 2.66 లక్షల డాలర్లు చెల్లించినట్లు చెబుతున్నారు. 
 
చైనా విమర్శకులు మౌనం వహించేటట్లు చేయడం కోసం తమకు అనుకూలంగా అమెరికా పత్రికలలో వ్యాసాలు ప్రచురితమయ్యేటట్లు కూడా చైనా డైలీ చూస్తున్నది. `చైనా వాచ్’ పేరుతో వాషింగ్ టన్, వాల్ స్ట్రీట్ జర్నల్ `పెయిడ్ అనుబంధాలు’ ను ప్రకటించాయి. 
 
అమెరికా ప్రకటనలో `నిజమైన వార్తలు’ అనే అభిప్రాయం కలిగించే విధంగా చైనా ప్రచారపు ప్రకటనలు ప్రచురించడాన్ని అమెరికా అధ్యక్షుడు సెప్టెంబర్, 2018లో ప్రశ్నించారు. “బెల్ట్ అండ్ రోడ్ ఆఫ్రికా దేశాలతో పొత్తు” అంటూ 2018లో న్యూయార్క్ టైమ్స్, వాషింగ్ టన్ పోస్ట్ `స్పాన్సర్డ్’ వార్తలు ప్రచురించాయి. 
 
అదే వార్తలో చైనా వస్తువులపై ట్రంప్ ప్రభుత్వం పన్నులు పెంచడాన్ని విమర్శిస్తూ పేర్కొన్నారు. దాని వల్లన అమెరికాలో గృహనిర్మాణ వ్యయం పెరిగిపోతున్నట్లు ఆందోళన వ్యక్తం చేశారు. 
 
చైనా డైలీ అమెరికాలో విదేశీ ఏజెంట్ల నమోదు చట్టం క్రింద నమోదై ఉండడంతో ఆదాయ, వ్యయాలను ప్రభుత్వానికి సమర్పించవలసి ఉంటుంది. ఆ పత్రిక సమర్పించిన నివేదికలను బట్టే వారేవిధంగా అమెరికా నిధులను సమకూరుస్తున్నారో వెల్లడైనది.