హెచ్‌1బీ వీసాల సస్పెండ్‌ ఆలోచన ! 

హెచ్‌1బీ వీసాలను సస్పెండ్‌ చేసేందుకు డోనాల్డ్  ట్రంప్‌ ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. కరోనా మహమ్మారి వల్ల అమెరికాలో తీవ్ర స్థాయిలో పెరిగిన నిరుద్యోగ సమస్యను ఎదుర్కొనేందుకు ట్రంప్‌ సర్కార్‌.. హెచ్‌1బీ వీసాలతో పాటు ఇతర వీసాలను కూడా రద్దు చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.

నూతన వార్షిక ఏడాది అక్టోబర్‌ 1 నుంచి ప్రారంభంకానున్నది. ఆ సమయంలో ఈ కొత్త ప్రతిపాదిత నిబంధనలను అమలులోకి తీసుకువచ్చే ప్రయత్నం జరుగుతున్నది. వీసాల కత్తిరింపునకు సంబంధించి వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ ఓ కథనాన్ని రాసింది.  హెచ్‌1బీ వీసాలను తగ్గిస్తున్నట్లు ఆ పత్రికకు ఓ అధికారి ఇంటర్వ్యూ ఇచ్చారు.

తాజా ప్రతిపాదన వల్ల హెచ్‌1బీ వీసా కోసం ప్రయత్నం చేస్తున్న వారి ఆశలకు గండిపడినట్లు తెలుస్తోంది.  అయితే సస్పెషన్‌ ఎత్తివేసేంత వరకు ఆ వీసాలు ఉన్న వారు అమెరికాలోకి ప్రవేశించడం అసాధ్యం కాగలదు. ఇప్పటికే హెచ్‌1బీ వీసా ఉన్న వారు అమెరికాలో కరోనా వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 

ఇప్పుడు తాజా ప్రతిపాదనతో కొత్త భారతీయ టెకీలకు పరిస్థితులు మరింత గడ్డుగా మారనున్నాయి.  కరోనా మహమ్మారి వల్ల ఉద్యోగాలు కోల్పోయిన హెచ్‌1బీ వీసాదారులు ఇప్పటికే అమెరికా నుంచి స్వదేశాలకు పయనమవుతున్నారు.  అయితే వీసా సస్పెన్షన్‌పై తుది నిర్ణయం తీసుకోలేదని శ్వేతసౌధం స్పష్టం చేసింది. కానీ పరిపాలనా విభాగం ఇతర ప్రతిపాదలను ఆలోచిస్తున్నట్లు వైట్‌హౌజ్‌ ప్రతినిధి హోగన్‌ గిడ్లే పేర్కొన్నారు.