కేసీఆర్ కరోనా `చికిత్స’ పై గవర్నర్ తీవ్ర అసంతృప్తి 

తెలంగాణలో కె చంద్రశేఖరరావు ప్రభుత్వం కరోనా కట్టడిని గాలికి వదిలివేసి, రాజకీయ ప్రయోజనాలకు పరిమితం అవుతూ ఉండడంతో రాష్ట్రంలో కరోనా ఉధృతి నానాటికి ఆందోళనకరంగా మారుతున్నది. దేశం మొత్తం మీద అతి తక్కువ కరోనా టెస్ట్ లు జరుపుతూ,  అత్యధికంగా మృతుల శాతం ఉన్న రాష్ట్రంగా తెలంగాణ అపఖ్యాతి పాలవుతున్నది. 

రాష్ట్ర ప్రభుత్వ ధోరణి పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ కేంద్ర ఆరోగ్య కార్యదర్శి ప్రీతి సుడాన్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్హ్సికి లేఖ వ్రాసినా ప్రయోజనం లేకపోయింది. తాజాగా ఎన్నడూ వివాదాస్పద ప్రకటనలు చేయని రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ సహితం సహనం కోల్పోతున్నారు. 

కరోనా విషయంలో రాష్ట్ర ప్రభుత్వ పనితీరు పట్ల ఆమె తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ విషయమై గత రెండు, మూడు నెలలుగా తాను ఎన్నో లేఖలు వ్రాసినా రాష్ర ప్రభుత్వం నుండి స్పందన లేదని ఆమె విచారం వ్యక్తం చేశారు. 

రాష్ట్రంలో పలు ఆసుపత్రులలో వైద్యులకు, ఆరోగ్య కార్యకర్తలకు కూడా వైరస్ సోకుతూ ఉండడం పట్ల ఆమె తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఇదే పరిస్థితి కొనసాగుతూ ఉంటె తాను “ఇంకెంత మాత్రం చూస్తూ ఊరుకోను” అంటూ స్పష్టం చేశారు. డెక్కన్ క్రానికల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ లో రాష్ట్రంలో కరోనా పరిస్థితి పట్ల తన ఆందోళన, ఆవేదనలను మొదటి సారిగా ఆమె బహిరంగంగా వ్యక్తం చేశారు. 

కరోనాకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న సమాచారం పట్ల కూడా ఆమె అసంతృప్తి వ్యక్తం చేశారు. మీడియాకు విడుదల చేస్తున్న హెల్త్ బులెటిన్ నే తనకూ పంపుతున్నారని చెబుతూ ప్రభుత్వ వ్యవహారంలో పారదర్శకత లేదని,  గోప్యత కనబడుతున్నదని స్పష్టం చేశారు. ఈ వైరస్ కు సంబంధించిన వాస్తవాలను కప్పిపుచ్చుతున్నదని విమర్శించారు. రాష్ట్ర హై కోర్ట్ సహితం కరోనా టెస్ట్ లు తగ్గించడం పట్ల తీవ్రంగా స్పందించడం ఈ సందర్భంగా గమనార్హం. 

నిమ్స్ లో చాలామంది వైద్యులు కరోనా బారిన పడ్డారని తెలియగానే ఒక వైద్యురాలిగా ఆందోళనలు గవర్నర్ ఆ ఆసుపత్రిని సోమవారం సందర్శించారు. ఆ విధంగా సందర్శించడం వైద్య, ఆరోగ్య శాఖకు ఇష్టం లేదు. ఆమెను నివారించడం కోసం ఆసుపత్రి అధికారులు, వైద్య, ఆరోగ్య అధికారులు కూడా ప్రయత్నం చేశారు. 

కరోనా ఉధృతంగా ఉన్న సమయంలో ఒక ఆసుపత్రిని సందర్శించడం ప్రమాదంతో కూడుకున్నదని ఒక వైద్యురాలిగా తనకు అవగాహన ఉన్నప్పటికీ సమాజం కోసం ప్రమాదంలో పనిచేస్తున్న వైద్యులు, ఆరోగ్య కార్యకర్తలను కలుసుకోవాలని నిర్ణయించుకొని వెళ్లానని ఆమె స్పష్టం చేశారు. “వారు అపురూపమైన జాతీయ సంపద. వారి వెంట నేను ఉన్నాననే భరోసా కంపించడం కోసం నేను వెళ్ళాను” అని ఆమె చెపాప్రు. 

“కరోనా పట్ల నా ఆవేదనను వ్యక్తం చేస్తూ, కొన్ని సూచనలు చేస్తూ, కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలను అమలు జరిపామని సూచిస్తూ  పలు లేఖలు వ్రాసాను. అయితే సమాధానాలు అసంతృప్తిగా ఉన్నాయి. ప్రాధమిక సమాచారం కూడా ఇవ్వడం లేదు” అని గవర్నర్ ఆ ఇంటర్వ్యూ లో పేర్కొన్నారు. వైరస్ వ్యాప్తి గురించి, జరుపుతున్న టెస్ట్ ల గురించి, నివారణకు తీసుకొంటున్న చర్యల గురించి కూడా ఆమె తన లేఖలలో అడిగారు.