భారత్ నుండి హజ్ యాత్ర ఈసారి లేనట్లే

ఈ ఏడాది భారతదేశం నుంచి ముస్లిం యాత్రికులు హజ్ యాత్రకు వెళ్లే అవకాశం లేదని వెల్లడైంది. కరోనా వైరస్ బెడద ముప్పు తప్పేలా లేకపోవడంతో హజ్ యాత్రకు బ్రేక్ పడనుందని తెలుస్తున్నది. 

దేశంలోని హజ్ కమిటీ శుక్రవారమే ఒక సర్కులర్ వెలువరించింది. ఈ ఏడాది హజ్ యాత్రకు సన్నాహక పనులకు ఇంకా కొద్ది వారాల వ్యవధే మిగిలి ఉంది. అయితే హజ్‌కు ఆతిథ్యదేశం అయిన సౌదీ అరేబియా నుంచి యాత్రపై అధికారికంగా ఎటువంటి సమాచారం అందలేదని కమిటీ తెలిపింది. 

అసలు ఈ ఏడాది హజ్ యాత్ర నిర్వహణపై సౌదీ అరేబియా స్పష్టత ఇవ్వాల్సి ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. సౌదీ సమాచారం మేరకే భారత్ హజ్ యాత్రపై స్పష్టత వస్తుందని అధికార వర్గాలు తెలిపాయి.

కరోనా వైరస్ ప్రపంచ స్థాయి తీవ్రతతో ఇప్పటికైతే హజ్ 2020పై పూర్తి స్థాయిలో అస్పష్టత నెలకొంది. దీనిని దృష్టిలో పెట్టుకుని హజ్ పర్యటనను రద్దు చేసుకోవాలనే యాత్రికులు తమకు తెలియచేయాల్సి ఉంటుందని భారత్ కు  చెందిన హజ్ కమిటీ కార్యనిర్వాహక అధికారి మక్సూద్ అహ్మద్ ఖాన్ తెలిపారు. ఆయా యాత్రికులు చెల్లించిన మొత్తాలను పూర్తి స్థాయిలో తిరిగి ఇచ్చివేయడం జరుగుతుందని ఖాన్ చెప్పారు.