బలగాల మోహరింపు ఆపండి.. చైనాకు భారత్ స్పష్టం 

వాస్తవాధీన రేఖ వద్ద ఏప్రిల్‌ నాటి యథాతథ స్థితిని కొనసాగించాలని చైనాను భారత్‌ కోరింది. అలాగే గాల్వన్‌ లోయ సమీపంలో బలగాలు, ఆయుధాల మోహరింపును ఆపాలని స్పష్టం చేసింది. తూర్పు లడఖ్‌లో నెలరోజులుగా కొనసాగుతున్న సరిహద్దు ప్రతిష్ఠంభనను తొలిగించేందుకు రెండు దేశాల మధ్య శనివారం జరిగిన లెఫ్టినెంట్‌ జనరల్‌ స్థాయి చర్చల్లో ఈ మేరకు భారత్‌ సూచనలు చేసినట్లు సమాచారం. 

మరోవైపు, భారత్‌ చేపడుతున్న రహదారి నిర్మాణంపై చైనా అభ్యంతరం తెలిపినట్లు తెలిసింది. అయితే వాస్తవాధీన రేఖకు లోపలే తాము రహదారి నిర్మిస్తున్నామని, దీనిపై చైనా అభ్యంతరం తెలుపాల్సిన అవసరం లేదని భారత్‌ పేర్కొంది. చైనా వైపున ఉన్న తూర్ప లడఖ్‌లోని మాల్డో వద్ద సుమారు మూడు గంటలకు పైగా ఈ చర్చలు జరిగాయి. 

భారత్‌ బృందానికి లెఫ్టినెంట్‌ జనరల్‌ హరీందర్‌ సింగ్‌ నేతృత్వం వహించగా, చైనా బృందానికి టిబెట్‌ మిలిటరీ డిస్ట్రిక్ట్‌ కమాండర్‌ సారథ్యం వహించారు.  సానుకూల వాతావరణంలో చర్చలు జరిగినట్లు సీనియర్‌ అధికారి ఒకరు తె లిపారు.చైనాతో సంప్రదింపుల వివరాలను హరీందర్‌ సింగ్‌ బృందం సైన్యాధిపతి ఎంఎం నరవణేకు వివరించనుంది.

చర్చలకు సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. అయితే అంతకు ముందు సైనిక ఉన్నతాధికారి ఒకరు మాట్లాడుతూ ప్రస్తుత ఉద్రిక్తతలను తగ్గించేందుకు దౌత్య, సైనిక వ్యవస్థల ద్వారా అరు దేశాలు సంప్రదింపులను కొనసాగిస్తున్నాయని చెప్పారు.

కాగా, ఇరు దేశాల మధ్య సైనిక స్థాయిలో చర్చలు అసంపూర్తిగానే ఉన్నాయని, ఇవి కొనసాగుతాయని దేశ రాజధానిలో అధికార వర్గాలు శనివారం రాత్రి తెలిపాయి. అత్యున్నత స్థాయిలో సంప్రదింపులు జరిగినట్లు, అయితే ఈ ప్రక్రియ పూర్తి అయినట్లుగా భావించరాదని పేర్కొన్నారు. ఇప్పటికిప్పుడు చర్చల దశపై ఎటువంటి ఊహాజనిత వార్తలకు దిగవద్దని సైనిక వర్గాలు స్పష్టం చేశాయి. చర్చల ప్రక్రియ ఇంకా మిగిలి ఉందని సంకేతాలు వెలువరించారు.  

ప్రతిష్ఠంభనకు ముగింపు పలికేందుకు వివిధ స్థాయిల్లో చర్చలు కొనసాగే అవకాశం ఉన్నది. 12 సార్లు స్థానిక కమాండర్ల స్థాయి అధికారులు, మూడు సార్లు మేజర్‌ జనరల్‌ స్థాయి అధికారులు చర్చలు జరిపినా ఫలితం లేకపోవడంతో తాజాగా లెఫ్టినెంట్‌ జనరల్‌ స్థాయి సమావేశాలను నిర్వహించారు.

గత కొంతకాలంగా వాస్తవాధీన రేఖ వెంబడి చైనా దుందుడుకు చర్యలకు దిగుతున్నది. బలగాలను భారీగా పెంచింది. పాంగాంగ్‌కు 180 కిలోమీటర్లు దూరంలో ఉన్న ఎయిర్‌బేస్‌ను కూడా విస్తరించింది. ఈ నేపథ్యంలో భారత్‌ కూడా సరిహద్దుల వద్ద అదనపు సైన్యాన్ని మోహరిస్తున్నది.

పాంగాంగ్‌లోని ఫింగర్‌ ఏరియా వద్ద భారత్‌ కీలకమైన రహదారిని నిర్మిస్తుండడంతోపాటు గాల్వన్‌లోయలో దర్బక్‌,-షాయోక్‌-దౌలత్‌ బేగ్‌ ఓల్డీలను కలుపుతూ మరో రోడ్డును నిర్మిస్తుండడం చైనాకు కంటిగింపుగా మారింది. వీటిపై చైనా అభ్యంతరం చెబుతున్నా భారత్‌ వెనక్కి తగ్గడం లేదు. ఇటీవల తూర్పు లడఖ్‌, సిక్కింలో ఇరుదేశాల సైనికులు బాహాబాహీకి దిగడంతో రెండువైపులా పలువురు జవాన్లు గాయపడ్డారు.