యాంటీ మలేరియా మందు హైడ్రాక్సీక్లోరోక్విన్‌ను మళ్లీ కరోనా వైరస్ పేషెంట్లపై పరీక్షించేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ సుముఖత చూపింది. కోవిడ్19 రోగులు హైడ్రాక్సీక్లోరోక్విన్ వేసుకుంటే, ప్రాణాంతకంగా మారే ప్రమాదం ఉందని గతంలో ల్యాన్‌సెట్ మెడికల్ జర్నల్ ఓ కథనాన్ని ప్రచురించింది. దాంతో మే 25వ తేదీ నుంచి హైడ్రాక్సీక్లోరోక్విన్ మాత్రలపై ప్రపంచ ఆరోగ్య సంస్థ ముందస్తు జాగ్రత్త నేపథ్యంలో నిషేధం విధించింది.
అయితే ప్రపంచ ఆరోగ్య సంస్థకు చెందిన ఎగ్జిక్యూటివ్ బృందం తాజాగా కొత్త నిర్ణయం తీసుకున్నది. గతంలో ముందుస్తు జాగ్రత్తగా ఆ ట్యాబ్లెట్లపై తాత్కాలిక నిషేధం విధించామని, సేఫ్టీ డేటాను సమీక్షించిన తర్వాత మళ్లీ హైడ్రాక్సీక్లోరోక్విన్ మాత్రలపై ట్రయల్స్ కొనసాగించాలని నిర్ణయించినట్లు డబ్ల్యూహెచ్‌వో డైరక్టర్ జనరల్ టెడ్రోస్ తెలిపారు.
మోర్టాలిటీ డేటాను సమీక్షించిన సాలిడారిటీ బృందం.. హైడ్రాక్సీ మాత్రల ట్రయల్స్‌ను కొనసాగించాలని నిర్ణయించినట్లు టెడ్రోస్ చెప్పారు. తాము పరీక్ష చేపడుతున్న అన్ని డ్రగ్స్ వల్ల కూడా ఎటువంటి ప్రాణహాని లేదని చీఫ్ సైంటిస్ట్ సౌమ్య స్వామినాథన్ తెలిపారు. వీలైనంత త్వరగా ట్రయల్స్ చేపడితే, చికిత్సకు సంబంధించిన ఆధారం లభిస్తుందని ఆమె పేర్కొన్నారు.
అన్ని రకాల డ్రగ్స్‌పై ట్రయల్స్ చేపట్టేందుకు డబ్ల్యూహెచ్‌వో సిద్ధంగా ఉన్నట్లు ఆమె చెప్పారు. వైరస్ వల్లే కలిగే తీవ్ర అస్వస్థతను కూడా తగ్గించేందుకు డ్రగ్ ట్రయల్స్ నిర్వహిస్తున్నట్లు ఆమె తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా 35 దేశాల్లో సుమారు 3500 మందిపై డ్రగ్ ట్రయల్స్ జరుగుతున్నాయి. హైడ్రాక్సీ ట్యాబ్లెట్‌ను తాను రోజూ వేసుకుంటున్నట్లు ట్రంప్ పేర్కొన్న విషయం తెలిసిందే.
More Stories
చైనా సీసీటీవీ కెమెరాలు, ఇతర నిఘా పరికరాలపై ఆంక్షలు!
14 వరద బాధిత రాష్ట్రాలకు రూ. 5858 కోట్లు విడుదల
టాటా గ్రూప్‌లోని రెండు ఎయిర్‌లైన్స్ విలీనం