అమెరికాలో చదివిన విదేశీ నిపుణులకే ప్రాధాన్యం

అమెరికాలో చదివిన విదేశీ నిపుణులకు తొలి ప్రాధాన్యం లభించేలా చూడటమే లక్ష్యంగా  అమెరికా చట్ట సభల్లో కీలకమైన బిల్లును ప్రవేశపెట్టారు. హెచ్‌-1బీ, ఎల్‌-1 వీసా జారీ విధానంలో కీలక సంస్కరణలను ప్రతిపాదిస్తూ రెండు ప్రధాన పార్టీలు రూపొందించిన బిల్లును చట్టసభల్లో ప్రవేశపెట్టారు. 

ఈ బిల్లును ది హెచ్‌-1బీ అండ్‌ ఎల్‌-1 వీసా రిఫార్మ్‌ యాక్ట్‌ పేరిట చట్టసభల్లో ఈ బిల్లును ప్రవేశపెట్టారు.ఉన్నత విద్య, నైపుణ్యం కలిగి అమెరికాలో చదువుకున్న చురుకైన విద్యార్థులకు హెచ్‌-1బీ వీసా జారీలో తొలి ప్రాధాన్యం ఇవ్వాలని బిల్లులో పేర్కొన్నారు. అమెరికా ఉద్యోగుల స్థానాన్ని హెచ్‌-1బీ, ఎల్‌-1 వీసాదారులను భర్తీ చేయడాన్ని పూర్తిగా నిషేధించాలని బిల్లులో స్పష్టం చేశారు. 

ఈ వీసాదారుల వల్ల ఇతర అమెరికా ఉద్యోగులు, కార్మికుల పనితీరు, పని ప్రదేశంపై ఎలాంటి ప్రతికూల ప్రభావం పడకుండా చూడాలని పేర్కొన్నారు. తాత్కాలిక శిక్షణా ప్రయోజనాల కోసం పెద్ద సంఖ్యలో హెచ్‌-1బీ, ఎల్‌-1 ఉద్యోగులను దిగుమతి చేసుకుని తిరిగి వారిని సొంత దేశానికి పంపుతున్న అవుట్‌ సోర్సింగ్‌ కంపెనీలపై ఉక్కుపాదం మోపాలని బిల్లులో ప్రతిపాదించారు. 

ఇక వీసా నిబంధనలు, ఉద్యోగుల నియామకాల విషయంలో ఆయా కంపెనీల యాజమాన్యాలు నిబంధనల ప్రకారం నడుచుకునేలా చూసేందుకు లేబర్‌ డిపార్ట్‌మెంట్‌కు మరిన్ని అధికారాలను కట్టబెట్టారు. ఆయా కంపెనీలు హెచ్‌-1బీ, ఎల్‌-1 వీసాదారుల సమగ్ర వివరాలు అందజేసేలా చూడాలి. 

నిబంధనల్ని ఉల్లంఘించినట్లు తేలితే శిక్షించే అధికారాన్ని కూడా బిల్లులో ప్రతిపాదించారు. కచ్చితమైన వేతన నిబంధన అమలు చేస్తే విదేశీ ఉద్యోగులను కంపెనీలు తెచ్చుకోవన్న ఉద్దేశంతో ఈ ప్రతిపాదన చేశారు. బిల్లు ఆమోదం పొందితే హెచ్ 1బీ వీసాదారులకు ఇబ్బందులు తప్పవు.

వైరస్ మహమ్మారి దెబ్బతో   ఆ దేశంలో నిరుద్యోగిత రేటు భారీగా పెరిగిపోయింది. ఈ క్రమంలో అమెరికా పౌరుల ఉద్యోగ అవకాశాలకు గండి పడకుండా అమెరికా దిద్దుబాటు చర్యలు చేపట్టింది.